కైఫ్‌, యువరాజ్‌లా.. మరో భారీ భాగస్వామ్యం నిర్మిద్దాం: ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రజలనుద్దేశించి.. మరో భారీ భాగస్వామ్యం నిర్మిద్దామని ట్విట్టర్‌ ద్వారా పిలుపునిచ్చారు. భారత మాజీ క్రికెటర్లు యువ్‌రాజ్‌, మహమ్మద్‌ కైఫ్‌ ఇంగ్లాండ్‌ వేదికగా 2002లో జరిగిన నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై చెలరేగి ఆడి, భారత్‌కు భారీ విజయాన్ని సాధించిపెట్టారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వారు చూపిన తెగువ అనిర్వచనీయమని తెలిపిన ప్రధాని.. ఇప్పుడు మనమంతా కూడా దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరమున్నదని అన్నారు. ఇందుకు గాను ఆదివారం ప్రజలంతా జనతా కర్ఫ్యూకు సహకరించి, కరోనా వైరస్‌ అరికట్టడంలో తమవంతు పాత్ర వహించాలని తెలిపారు.


ప్రధాని పిలుపునకు క్రికెటర్‌ కైఫ్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. దేశాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైనదనీ.. ప్రధాని సూచనలు పాటించి, మనల్ని మనం రక్షించుకుందామని కైఫ్‌ తెలిపారు. 


2002లో నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో 326 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. ఇన్నింగ్స్‌ను అద్భుతంగానే ఆరంభించింది. అనంతరం పుంజుకున్న ఇంగ్లాండ్‌ బౌలర్లు 146 పరుగులకే 5 కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్‌లో పైచేయి సాధించారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కైఫ్‌, యువరాజ్‌ పోరాడిన తీరు అద్భుతం. ఇద్దరు కలిసి ఆరో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం సాధించిపెట్టారు. యువరాజ్‌ 69 పరుగులకు ఔటయినప్పటికీ.. కైఫ్‌ టెయిలెండర్ల సాయంతో రెండు వికెట్ల తేడాతో భారత్‌కు విజయాన్ని అందించాడు. 


దేశంలో ఇప్పటికే కరోనా వైరస్‌ మహమ్మారి బారిన  258 మంది పడగా.. వారిలో నలుగురు మృతిచెందారు. ఈ సంఖ్య పెరగకుండా జాగ్రత్త పడాలనీ.. ఈ మహమ్మారిని దేశంలో అంతమొందించాలని ప్రధాని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.