రాబోయే రెండు నెలల్లో జనగామలో 100 టాయిలెట్లను నిర్మించాలని సంబంధిత అధికారులకు మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జనగామ పట్టణంలోని ధర్మకంచ బస్తీలో కేటీఆర్ పర్యటించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు.
సీఎం కేసీఆర్ వల్లే జనగామ జిల్లా అయిందన్నారు. ప్రజల దగ్గరకే పరిపాలన తీసుకువచ్చామని కేటీఆర్ తెలిపారు. అన్ని పట్టణాల్లో పచ్చదనం - పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వార్డు కమిటీలు పారిశుద్ధ్య ప్రణాళికలు అమలు చేయాలన్నారు. ప్రతి ఇంటికి తడి, పొడి చెత్తను సేకరించేందుకు రెండు బుట్టలు ఇస్తామన్నారు కేటీఆర్. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించిన తర్వాత డంపింగ్ యార్డుల్లో రెండు రకాల కార్యక్రమాలు చేపడుతామని మంత్రి తెలిపారు. తడి చెత్తతో ఎరువులు తయారు చేసి జనగామ పట్టణ ప్రజలకు అందిస్తాం. తడి, పొడి చెత్త సేకరణకు రిక్షాల్లో కూడా వేర్వేరుగా డబ్బాలు ఏర్పాటు చేయాలని కేటీఆర్ ఆదేశించారు.